Sunday, 19 May 2013

తల్లి మనసు


     హమ్మయ్య !! పడుకుంది  అని అప్పుడే కాస్త నడుం వాల్చింది గీత. మళ్ళా చిన్న పాప ఏడుపు మొదలు . అప్పటిదాకా ఉయ్యాల ఊపి ఊపి నడుం పట్టేసింది . పాప ఏడుపు విని తనకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక పక్క పెద్ద పాప పడుకోవడానికి నానా గోలా చేస్తోంది. చిన్న పాపని పడుకోపెడితే కాని పెద్ద దాని సంగతి చూడలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ఆయన తనకేమి పట్టనట్టు laptop లో దూరి మరీ నవల చదివేస్తున్నాడు ఎదో పరీక్షునట్టు. పిల్లలంతా నీ బాధ్యతే నాకేం సంబంధం లేదు అన్న expression ఇస్తూ. అది చూసి గీత కి ఇంకా ఏడుపొస్తోంది. మొత్తానికి చిన్నదాన్ని పడుకోపెట్టి పెద్దదాని దగ్గరకెళ్ళిoది. దాన్ని పడుకోపెడుతూ  ఆలోచనలో పడింది.



     ఇద్దరు పిల్లలు వచ్చిన దగ్గర నుండి తనకంటూ సమయమే లేకుండాపోయింది. అన్నం ప్రశాంతం గా తిన్నదీ  లేదు. హాయిగా నిద్రపోయినది లేదు. ఇవన్నీ  తలచుకుంటుంటే ఇంకా ఏడుపు ఎక్కువవుతోంది గీతకి. తనేదో చాలా త్యాగం చేస్తోంది అన్న ఫీలింగ్. తను పిల్లల కోసమని ఉద్యోగం మానేసింది. డెలివరీ తర్వాత ఒళ్ళు కూడా బాగా వచ్చేసింది. exercise చెయ్యడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. అంద విహీనం గా అయిపోయాను అన్న బాధ . ఎంత పని వాళ్ళు ఉన్నా  పిల్లలని వాళ్ళ మీద పూర్తిగా వదలడం గీతకి అస్సలు ఇష్టం లేదు.తన జీవితం లో ఏదో కోల్పోయాను అనే చిన్న guilt . అప్పుడు హఠాత్తుగా తనకి అమ్మ గుర్తొచ్చింది. 

    అసలు అమ్మ మమ్మల్ని ఎలా manage చేసింది?అవును మరి గీత వాళ్ళు ఒకరికి ముగ్గురు,పైగా వచ్చి వెళ్ళే చుట్టాలు,నాయనమ్మ బాబాయ్ వాళ్ళు మరియు నాన్నగారు. అమ్మో ఇంత మందిని సమర్ధించుకుంటూ ఎలా వచ్చింది ?? తను కనీసం ఏనాడు అమ్మ కి సహాయం చేసిన పాపానికి కాదు కాదు పుణ్యానికి పోలేదు. ఇప్పుడు గీత కి ఇద్దరు పనివాళ్ళు ఒక అమ్మాయి ఇంటి పని చేసి వెళ్తుంది , ఇంకో అమ్మాయి పిల్లలని చూసుకుంటుంది. అయినా గీత కి కష్టం గానే ఉంది.ఎప్పుడన్నా ఎవరన్నా  చుట్టాలు వచ్చారో ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది. 

  గీత అలా తన గతం లోకి ఒకసారి తొంగి చూసింది . కళ్ళ ముందు చక్రం గిర్రున తిరిగింది. అమ్మ తనకి ఉహ తెలిసినప్పటి నుండి ఎప్పుడు చుసినా వంటిల్లే తప్ప వేరే ప్రపంచం తెలియదు. పొద్దున్న లేచిన దగ్గరి నుండి కాఫీ,టిఫిను తర్వాత భోజనం బాక్స్ లోకి సర్దడం ,ఇవన్ని చేస్తూనే ఒక పక్క దేవుడికి దీపం పెట్టడం ,ఏవో స్తోత్రాలు చదవడం , పిల్లలకి జడలు వెయ్యడం... అమ్మో! multi-tasking ki best example అనొచ్చేమో మరి. ఎంత అలసిపోయినా పిల్లలకి పెద్దలకి ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకునేది. అందరికంటే ముందు లేచి అందరికంటే చివర పడుకునేది.తనకంటూ ఒక ఇష్టం అనేది ఎప్పుడూ లేదు అమ్మకి.పిల్లలు,భర్త ఇష్టమే తన ఇష్టం కింద మర్చేసుకుంది.  భోజనం లో కూర బాగుందంటే తనకోసం కూడా ఉంచుకోకుండా మొత్తం వడ్డిన్చేసేది. పగలు అన్నం మిగిలిపోతే తను మాత్రమే తినేది, అందరికీ వేడి వేడిగా పెట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా??
 ఒకసారి గీత అడిగింది వాళ్ళ అమ్మ ని "నువ్వేం సాధించావమ్మా  ఇన్నేళ్ళలో" అని. అప్పుడు అమ్మ సమాధానం "మిమ్మల్ని సాధించాను ఇంకేం కావాలి?" అని.అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి గీతకు.

 అవును మరి అమ్మ ఎంత ప్రేమగా చూసుకునేది?! ఒక్కసారైనా తనని కొట్టినట్టు కానీ కనీసం విసుక్కున్నట్టు కానీ గుర్తు లేదు. చెల్లిని, తమ్ముడిని కూడా ఒక్క చదువు విషయం లో తప్ప మరెప్పుడు ఏమీ అన్నట్టు గుర్తులేదు. ఎప్పుడన్నా తనకి జ్వరం వస్తే రోజంతా ఒకపక్క పని చేసుకుంటూ కాపలా కాసేది.

 "అమ్మా!!! నువ్వెంత గోప్పదనివి? సహనసీలివి? " అంటూ కళ్ళు తుడుచుకుని, నేను మరీ అమ్మంత కాకపోయినా నా పిల్లలని జాగ్రత్తగా,ప్రేమగా చూసుకోవాలి అనుకుంది గీత. "అమ్మా!! నువ్వే నా inspiration !! నువ్వు పడ్డ కష్టాల ముందు నావసలు కష్టాలే కావు!నీ త్యాగాల ముందు నావసలు త్యాగాలే కాదు!" అనుకుంది. ఇద్దరి పిల్లలని ముద్దు పెట్టుకుని "మీరే నా assets" అనుకుని హాయిగా నిద్ర లోకి జారుకుంది గీత !!

Sunday, 5 May 2013

"అమ్మా అని కొత్త గా "

అమ్మా అని పిలవంగానే నేను ఎందుకు సంతోష పడుతున్నాను ??
అమ్మా ఎత్తు కొమ్మా అనగానే చేసే పనంతా వదిలేసి మరీ ఎందుకు వెళ్ళిపోతున్నాను ??
అమ్మా ఆయోచింది అని ఏడుస్తుంటే నా మనసు ఎందుకు తట్టుకోలేకపోతోంది ??
అమ్మా ఆడుకుందాం రామ్మా అని పిలిచిన నా చిట్టి తల్లి తో నేనెందుకు వెళుతున్నాను ??
అమ్మా అని సంతోషం గా వచ్చి నన్ను పట్టుకోగానే నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి??
తను ఒక్క రోజైన సరిగ్గా అన్నం తినక పోతే నా మనసు ఎందుకు బాధపడుతోంది ??
తనకి జ్వరం వస్తే నేనెందుకు ఆరాటపడుతున్నాను తగ్గించడానికి ??
తనని బడికి పంపుతున్నప్పుడు నా మనసు ఎందుకు బాధ పడుతోంది తన అమాయక మొహం చూసి ??
తనకి దెబ్బ తగిలితే నా మనసెందుకు రోధిస్తోంది ??
తను నిదురపోతున్న వేళ తనని చుసిన నా కళ్ళు ఎందుకు చెమ్మ గిల్లుతున్నాయి ??
తను చేసే అల్లరి చూసి నేనెందుకు మురిసి పోతున్నాను ??
తను అమ్మా నువ్వొద్దు అని నానమ్మ తో నో అమ్మమ్మ తోనో వెళ్ళుతుంటే నేనెందుకు బిక్కమొహం తో బాధగా చూస్తున్నాను ??
తన నవ్వు నాకోసమే అని ఎందుకనిపిస్తోంది ??
తన నవ్వు తో ఎంత కష్టాన్నైనా ఎలాగ మర్చిపో గలుగుతున్న??
తనకి ఈ ప్రపంచం లో దేనినైన సరే తెచ్చిద్దాం అని ఎందుకనిపిస్తోంది ??

ఒక్కో సారి ఏమీ చేయలేని నా అసమర్ధత ని నేనెందుకు తిట్టుకుంటాను తనకి ఒంట్లో బాగాలేకపోతే ??

నా ఈ మనోభావాలకి ఆంతర్యం ఏమిటి ??
ఓ ఇదేనా అమ్మతనం అంటే ??
అమ్మతనం లో ఉన్న కమ్మదనం అంటే ??

అవును నేను అమ్మ గా మళ్ళి పుట్టాను.... అమ్మ అని తను ఎప్పుడు పిలిచినా నాకు అదో కొత్త అనుభూతే !!!
ఈ కమ్మదనం ని ఆస్వాదిస్తున్న అందరి తల్లులకు ముఖ్యం గా నా తల్లి కి ఇది అంకితం !!!

MOTHER'S DAY సందర్భంగా !!

కారణం ఏమిటి?? చెప్పగలరా ఎవరైనా ??

ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతోంది ?? మానవత్వం ఏమయిపోతోంది? మనుషులు జంతువుల కంటే హీనంగా ఎందుకు  తయారవుతున్నారు?? ఇదేనా మనం సంపాదించిన విజ్ఞానం ? బహుశా కలియుగాంతం వచ్చేసిందేమో??ఏమిటి  ఈ ప్రశ్నల  పరంపర అంటే  దానికి సమాధానం ఈ రోజుల్లో జరుగుతున్న దారుణమైన సంఘటనలే !!



ఒక అమ్మాయిని దారుణం గా ఒక బస్సు లో గ్యాంగ్ రేప్ చేసారని విని, వాళ్ళు ఎంత దారుణం గా ఆ అమ్మాయిని వేధించారో టీవీ లోనూ న్యూస్పేపర్ లోనూ చూసి మనుషులంటే ఇంత దారుణం గా కూడా ఉంటారా? అనిపించేసింది . ఎంత చదువు లేక  పోయినా  మనిషికి కాస్త తెలివి అనేది ఉంది కదా? అదే కదా మనకి పశువులకి మధ్య తేడ ! అలాంటిది మనిషి ఆ తెలివి ని మరచి ఒక పశువు లాగ (బహుశా పశువులు కూడా అసహ్యించు కుంటాయేమో ??) ఇంత క్రురం గా ఎలా మారిపోయాడు??

ఇంకా ఆ సంఘటన మనసులో నుండి చెదరక ముందే మరొక సంఘటన అదీ  ఒక 5 సం చిన్నారిది ! చిన్న పిల్లలు దేవుడితో సమానం అని మనమందరం నమ్ముతాం . వాళ్ళ అమాయకత్వం కానీ, వాళ్ళ అల్లరి కానీ , వాళ్ళ కబుర్లు కానీ, చేతలు కానీ ఎలాంటి బాధనైనా  దూరం చేస్తుంది ,ఎవరి కైనా, ఎంత కష్టాల్లో ఉన్నా  సరే!! అలాంటిది ఒక చిన్నారిని ఎలా? ఎలా?ఎలా?


ఆ పసి హృదయం రేపు కోలుకొని మళ్ళా మాములుగా తిరగ గలుగుతుందా ? శరీరం కి తగిలిన గాయాలు మానిపోవచ్చు కానీ ఆ పసి హృదయం  మాటేంటి ? ఆ గాయం మానడానికి ఈ జీవితం మొత్తం పడుతుంది అంటే ఒప్పుకుంటారా? ఆ పాప కి మనుషులంటే నమ్మకం ఉంటుందా? ఆ భయం పోతుందా?


అయితే  దీనికి కారణం ఎవరు?ఎవరు?ఎవరు? అని ఎంత ఆలోచించినా దొరకని సమాధానం!! మద్యం సేవించి ఆ మత్తులో తెలివి ని కోల్పోయినందుకు మద్యం కారణమా ? లేక ఫోన్ ఫోనులో ఇబ్బందికరమైన దృశ్యాలు చూపించిన ఈ టెక్నాలజీదా ? లేక ఆ సైట్ దా ? అదీ కాకపోతే పాపం ఆ చిన్నపిల్ల ఇంటి ముందే కదా ఆడుకుంటోం దని వదిలిన వాళ్ళ అమ్మదా?అదీ కాకపోతే కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే స్పందించని అధికారులదా ? ఆ పశువులని దొరికిన వెంటనే ఉరి తియ్యని ఈ ప్రభుత్వానిదా?

 

ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని నిలదియ్యాలి?



ఇదివరకు ఒక వయసు వచ్చాక జాగ్రతలు చెప్పేవారు తల్లిదండ్రులు. బయటకి పంపడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మరి ఇప్పుడు కనీసం 5సం పాపని కూడా వదలని ఈ కిరాతకుల గురించి ఏమని వివరించాలి? అంటే ఇంకా ఆడపిల్ల కి స్వేచ్చ లేదా ? జీవితమంతా భయంగానే గడపాలా ? అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎలా తెలుసుకోవాలి? పక్కింట్లో ఉన్న సుబ్బారావు కావచ్చు ఎదురింట్లో ఉన్న పుల్లారావు కావచ్చు .ఆ కిరాతకుడు మన పక్కనే ఉండచ్చు.   ఆడ పిల్లల  తల్లులు వారిని ఎలా కాపాడుకోవాలి? ఎంత వరకు కాపాడుకోగలరు?అసలు బయటకి పంపగలరా? అలాగని ఇంట్లో నే బంధించగలరా ? దయచేసి ఎవరన్నా చెప్పండి !!  

 

చెప్పగలరా ఎవరైనా?? 

 

అసలు దీనికి సమాధానముoదా ?

 

ఒక తల్లి గా నా ఆవేదన ఎవరికి  అర్ధమవుతుంది?