ఇద్దరు పిల్లలు వచ్చిన దగ్గర నుండి తనకంటూ సమయమే లేకుండాపోయింది. అన్నం ప్రశాంతం గా తిన్నదీ లేదు. హాయిగా నిద్రపోయినది లేదు. ఇవన్నీ తలచుకుంటుంటే ఇంకా ఏడుపు ఎక్కువవుతోంది గీతకి. తనేదో చాలా త్యాగం చేస్తోంది అన్న ఫీలింగ్. తను పిల్లల కోసమని ఉద్యోగం మానేసింది. డెలివరీ తర్వాత ఒళ్ళు కూడా బాగా వచ్చేసింది. exercise చెయ్యడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. అంద విహీనం గా అయిపోయాను అన్న బాధ . ఎంత పని వాళ్ళు ఉన్నా పిల్లలని వాళ్ళ మీద పూర్తిగా వదలడం గీతకి అస్సలు ఇష్టం లేదు.తన జీవితం లో ఏదో కోల్పోయాను అనే చిన్న guilt . అప్పుడు హఠాత్తుగా తనకి అమ్మ గుర్తొచ్చింది.
అసలు అమ్మ మమ్మల్ని ఎలా manage చేసింది?అవును మరి గీత వాళ్ళు ఒకరికి ముగ్గురు,పైగా వచ్చి వెళ్ళే చుట్టాలు,నాయనమ్మ బాబాయ్ వాళ్ళు మరియు నాన్నగారు. అమ్మో ఇంత మందిని సమర్ధించుకుంటూ ఎలా వచ్చింది ?? తను కనీసం ఏనాడు అమ్మ కి సహాయం చేసిన పాపానికి కాదు కాదు పుణ్యానికి పోలేదు. ఇప్పుడు గీత కి ఇద్దరు పనివాళ్ళు ఒక అమ్మాయి ఇంటి పని చేసి వెళ్తుంది , ఇంకో అమ్మాయి పిల్లలని చూసుకుంటుంది. అయినా గీత కి కష్టం గానే ఉంది.ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలు వచ్చారో ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది.
గీత అలా తన గతం లోకి ఒకసారి తొంగి చూసింది . కళ్ళ ముందు చక్రం గిర్రున తిరిగింది. అమ్మ తనకి ఉహ తెలిసినప్పటి నుండి ఎప్పుడు చుసినా వంటిల్లే తప్ప వేరే ప్రపంచం తెలియదు. పొద్దున్న లేచిన దగ్గరి నుండి కాఫీ,టిఫిను తర్వాత భోజనం బాక్స్ లోకి సర్దడం ,ఇవన్ని చేస్తూనే ఒక పక్క దేవుడికి దీపం పెట్టడం ,ఏవో స్తోత్రాలు చదవడం , పిల్లలకి జడలు వెయ్యడం... అమ్మో! multi-tasking ki best example అనొచ్చేమో మరి. ఎంత అలసిపోయినా పిల్లలకి పెద్దలకి ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకునేది. అందరికంటే ముందు లేచి అందరికంటే చివర పడుకునేది.తనకంటూ ఒక ఇష్టం అనేది ఎప్పుడూ లేదు అమ్మకి.పిల్లలు,భర్త ఇష్టమే తన ఇష్టం కింద మర్చేసుకుంది. భోజనం లో కూర బాగుందంటే తనకోసం కూడా ఉంచుకోకుండా మొత్తం వడ్డిన్చేసేది. పగలు అన్నం మిగిలిపోతే తను మాత్రమే తినేది, అందరికీ వేడి వేడిగా పెట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా??
ఒకసారి గీత అడిగింది వాళ్ళ అమ్మ ని "నువ్వేం సాధించావమ్మా ఇన్నేళ్ళలో" అని. అప్పుడు అమ్మ సమాధానం "మిమ్మల్ని సాధించాను ఇంకేం కావాలి?" అని.అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి గీతకు.
అవును మరి అమ్మ ఎంత ప్రేమగా చూసుకునేది?! ఒక్కసారైనా తనని కొట్టినట్టు కానీ కనీసం విసుక్కున్నట్టు కానీ గుర్తు లేదు. చెల్లిని, తమ్ముడిని కూడా ఒక్క చదువు విషయం లో తప్ప మరెప్పుడు ఏమీ అన్నట్టు గుర్తులేదు. ఎప్పుడన్నా తనకి జ్వరం వస్తే రోజంతా ఒకపక్క పని చేసుకుంటూ కాపలా కాసేది.
"అమ్మా!!! నువ్వెంత గోప్పదనివి? సహనసీలివి? " అంటూ కళ్ళు తుడుచుకుని, నేను మరీ అమ్మంత కాకపోయినా నా పిల్లలని జాగ్రత్తగా,ప్రేమగా చూసుకోవాలి అనుకుంది గీత. "అమ్మా!! నువ్వే నా inspiration !! నువ్వు పడ్డ కష్టాల ముందు నావసలు కష్టాలే కావు!నీ త్యాగాల ముందు నావసలు త్యాగాలే కాదు!" అనుకుంది. ఇద్దరి పిల్లలని ముద్దు పెట్టుకుని "మీరే నా assets" అనుకుని హాయిగా నిద్ర లోకి జారుకుంది గీత !!